“గ‌ళం’’ వినిపించారు.. బ‌లం పెంచుకున్నారా?

Narendra Modi , Chandrababu , Political consequences , Assembly election , TDP-Janasena-BJP , Nara Lokesh

పదేళ్ల కిందట సూపర్‌ సక్సెస్‌ కాంబినేషన్‌గా పేరొందిన న‌రేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మ‌రోసారి స‌క్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్న‌ట్లుగానే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజ‌య‌వంతం కావ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నంగా కూట‌మి నేత‌లు పేర్కొంటున్నారు. ‘ప్రజాగళం’  పేరుతో నిర్వ‌హించిన ఈ స‌భ‌ను స‌క్సెస్ చేయ‌డంలో కూట‌మి కృషి క‌నిపిస్తోంది.

పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలి సభ కావడం, ప్రధాని మోదీ హాజరు కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకంగా సభకు ఏర్పాట్లు చేశాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా లోక్‌సభ స్థానాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో ప‌నిచేశారు. వారిని నిత్యం ప్రోత్స‌హిస్తూ నారా లోకేశ్ కూడా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి చూశారు. రాష్ట్ర చరిత్రలో ఈ సభ ఒక మైలు రాయిగా ఉండిపోయేలా కూటమి నేతలు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేశారు. మళ్లీ దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం జ‌త‌క‌ట్టిన‌ట్టుగా త‌మ ఉద్దేశం ల‌క్ష‌లాది మందికి చేరేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

“కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈసారి 400+ సీట్లు కావాలి. అందుకు నా ఆంధ్రా కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలి. అప్పుడే వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యమవుతుంది” అని పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీ ఆక‌ట్టుకున్నారు. “నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలు. కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఈసారి ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలి. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400+ సీట్లు వచ్చేలా మీరు కృషి చేయాలి. ఎన్డీ కూటమి ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తుంది. ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్రరాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలి. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశం. వికసిత ఆంధ్రప్రదేశ్’’ అంటూ ఆ స‌భ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

ఈ స‌భలో నారా చంద్ర‌బాబునాయుడు హిందీలో కూడా కొంత‌సేపు ప్ర‌సంగించి మోదీని సైతం ఆక‌ట్టుకున్నారు. వైసీపీ పాల‌న‌లో ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమైపోయింద‌ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మేమందరం కలిశాం… అంటూ కూట‌మి ఆవ‌శ్య‌క‌త‌ను మ‌రోసారి చాటిచెప్పారు. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ వేదికపై భారతదేశం దూసుకుపోతోందన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే ఈ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో కూడా చూపించి వారి జీవితాల్లో వెలుగులు తెస్తామని, మార్పు చూపిస్తామని ప్రకటించారు.  ‘‘కక్ష, విధ్వంసం, అవినీతి, దోపిడీలకు జగన్‌ పర్యాయ పదం. లాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ సహా దేనినీ వదిలిపెట్టకుండా అడ్డగోలుగా దోచుకున్నారు. జగన్‌ మూడు ముక్కలాట పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారు.’’ అని జగన్‌ పాలనపై మండిపడ్డారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటేనని.. అది సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంపైనే చంద్ర‌బాబు దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపించింది.  ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘ప్రధాని మోదీ ప్రగతివాది. మన దేశాన్ని విశ్వగురువుగా నిలిపిన మహా శక్తి. అన్న యోజన, ఆవాస్‌ యోజన, కిసాన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, జలజీవన్‌ మిషన్‌ వంటి కార్యక్రమాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, గతి శక్తి వంటి కార్యక్రమాలతో దేశంలో సంపద సృష్టించారు. సబ్‌ కా సాత్‌… సబ్‌ కా వికాస్‌ నినాదంతో దేశ ప్రజలకు నమ్మకం కలిగించారు. కరోనా సమయంలో ఎంతో శ్రమించి మనందరి ప్రాణాలు కాపాడారు. వంద దేశాలకు వ్యాక్సిన్‌ పంపారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన ఎకానమీని పదేళ్లలో ఐదో స్థానంలోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో మన దేశం అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో నిలబడబోతోంది’’ అంటూ మోదీని కీర్తించారు.

రాష్ట్రంలో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిదే విజయమని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమ్మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో.. మోదీ రాక, ఎన్డీయే పునఃకలయిక 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించి ఆక‌ట్టుకున్నారు.  ‘ఆంధ్ర రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ వచ్చారు. మన కోసం, మన కష్టానికి భుజం కాయడానికి, 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని వచ్చారు. జరుగబోయేది ఎన్నికల కురుక్షేత్రం. ఈ యుద్ధంలో ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం. ’ అని చెప్పారు. ప్ర‌జాగ‌ళం స‌భ ద్వారా ఎన్డీఏ కూట‌మికి చెందిన ముగ్గురూ.. త‌మ గ‌ళాన్ని బ‌లంగా వినిపించి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =