సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ – సంక్రాంతి ఎంటర్‌టైనర్

2020 Telugu Movie Reviews, Mango News Telugu, Sarileru Neekevvaru Movie Public Talk, Sarileru Neekevvaru Movie Rating, Sarileru Neekevvaru Movie Review, Sarileru Neekevvaru Movie Story, Sarileru Neekevvaru Review, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Sarileru Neekevvaru Telugu Movie Public Response, Sarileru Neekevvaru Telugu Movie Review, Sarileru Neekevvaru Telugu Movie Review And Rating

చిత్రం: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు : మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందన, తమన్నా(స్పెషల్ సాంగ్), ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సంగీత, హరిప్రియ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, పోసాని, అజయ్, సత్యదేవ్
సినిమాటోగ్రఫర్ : రత్నవేలు
ఎడిటర్: తమ్మిరాజు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత‌లు : అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేది: 11-01-2020

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. బ్లాక్ బస్టర్ మహర్షి తరువాత మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతోపాటు ప్రేక్షకులకు కూడా చిత్రంపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోషన్స్ నిర్వహించి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. ఈసారి మాస్ ను ఆకట్టుకునేలా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ తో వచ్చిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

సినిమా కథ:

ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఉగ్రవాదుల చెరనుంచి పిల్లలను కాపాడే క్రమంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా కర్నూలు బయలు దేరి వెళ్తాడు. ఈ క్రమంలో సంస్కృతి (రష్మికా) పరిచయం జరుగుతుంది. అలాగే కర్నూల్ లో భారతి(విజయశాంతి) మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది. మేజర్ అజయ్ కృష్ణ, ప్రొఫెసర్ భారతిని వెతుక్కుంటూ కర్నూల్ ఎందుకొచ్చాడు? అక్కడ అసలు భారతికి మంత్రి నాగేంద్రప్రసాద్ (ప్రకాష్ రాజ్) ల మధ్య ఏం జరిగింది? చివరకు అక్కడ సమస్యలను అజయ్ కృష్ణ ఎలా పరిష్కరించాడనేది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

చాల రోజులు తర్వాత మహేష్ బాబు నుంచి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ రావడంతో అభిమానులకు పండుగ వాతావరణం నెలకుంది. ఈ సినిమాలో మహేష్ లుక్, పాత్ర తీరు ప్రేక్షకులకు విశేషంగా నచ్చుతుంది. యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్‌ తో మహేష్ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రీ ఇంటర్వెల్ ముందొచ్చే కొండారెడ్డి బురుజు దగ్గర ఫైట్, పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత విలన్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాల్లో మహేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ట్రైన్ ఎపిసోడ్లో కామెడీ, మహేష్ – రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు, కర్నూల్ లో విజయశాంతి ట్రాక్ ని మహేష్ డీల్ చేసే విధానం సినిమాని బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. ఇక చాలాకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన లేడి అమితాబ్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో రాణించారు. ప్రకాష్ రాజుకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో అద్భుతంగా అభినయించారు. కధానాయిక రష్మిక తన గ్లామర్ తో, అర్ధమవుతుందా అనే మేనరిజంతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి మెరిపించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సంగీత, హరితేజ, వెన్నెల కిషోర్, తదితరులు వారివారి పాత్రలమేరకు నటించారు.

సాంకేతిక విభాగం:

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఆర్మీ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దేవిశ్రీ మరోసారి తన సత్తా చాటాడు. సినిమాటోగ్రపర్ రత్నవేలు మంచి ప్రతిభ కనబరిచాడు. కథకి అనుగుణంగా సన్నివేశాల చిత్రీకరణలో తనవంతు పాత్రను అద్భుతంగా పోషించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాతలు కూడా సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి సన్నివేశం భారీతనంగా ఉండేలా రూపొందించారు. సినిమా ఆసాంతం మంచి నిర్మాణ విలువలు కనబడతాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో విజయపరంపరను కొనసాగించాడు. సినిమాలో అన్ని అంశాలను సమపాళ్లలో మేళవించి అభిమానులు మహేష్ బాబును ఎలా చూడాలని కోరుకున్నారో, చిత్రాన్ని అలానే తీర్చిదిద్ది అంచనాలను అందుకున్నాడు. తనబలమైన కామెడీ సన్నివేశాలతో పాటుగా యాక్షన్ సన్నివేశాల్లో కూడా తన మార్కును చూపిస్తూ వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని రూపొందించి గొప్ప విజయాన్ని అందుకున్నాడు.

తుది విశ్లేషణ:

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పండుగ వాతావరణాన్ని మరింతగా పెంచుతుంది. అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నా ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించి, బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగానే బొమ్మ నిజంగానే దద్దరిల్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eighteen =