బీఆర్ఎస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులను లైట్ తీసుకున్న కేసీఆర్

brs, brs menifesto, telangana assembly elections, telangana politics
brs, brs menifesto, telangana assembly elections, telangana politics

మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను రేస్‌లోకి దింపి పరుగెత్తిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో మొన్నటి వరకు ఇంటిపట్టునున్న కేసీఆర్ ఇప్పుడు కదనరంగంలోకి దూకేశారు. రావడం రావడంతోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా రైతులు, మహిళలను ఆకర్షించేలా హామీలు ప్రకటించారు. గత ఎన్నికల్లో కాస్త ఆలస్యంగా మేనిఫెస్టో ప్రకటించినప్పటికీ.. ఈసారి మాత్రం 45 రోజుల ముందుగానే ప్రకటించి రాజకీయాలను మరింత హీటెక్కించారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో తమ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్‌లను అందజేశారు. అనంతరం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను కూడా అమలు చేసిన ఘనత కేవలం బీఆర్ఎస్‌కే దక్కుతుందని కేసీఆర్ చెప్పారు. పోయిన సారి ఎన్నికల సమయంలో కేవలం 10 శాతం చెబితే 100 శాతం అమలు చేశామని.. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మేనిఫెస్టోను అమలు చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను చూస్తే.. పెన్షన్లను ప్రతి ఏటా రూ. 500 చొప్పున ఐదేళ్లలో రూ. 5 వేల వరకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. దివ్యాంగుల పెన్షన్లను రూ. 6 వేల వరకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకొచ్చి అర్హులైన ప్రతి మహిళకు రూ. 3 వేల గౌరవ భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే రైతు బీమా తరహాలో పేదల కోసం.. కేసీఆర్ బీమా పథకం తీసుకొస్తామని చెప్పారు. తెల్లరేషన్‌కార్డుదారులకు రూ. 5 లక్షల కేసీఆర్ బీమా చేపిస్తామని.. ఆ ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అన్నపూర్ణ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.

మరీ ముఖ్యంగా రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న గ్యాస్ ధరలను తగ్గిస్తామని.. కేవలం రూ. 400లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆరోగ్య శ్రీ పరిధి కూడా రూ. 15 లక్షలకు పెంచుతామన్నారు. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న రూ.10వేల రైతుబంధు సాయాన్ని దశల వారీగా రూ. 16 వేలకు పెంచుతామని తెలిపారు. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తామని పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ. 15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు.

అయితే కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ ప్రకటించిన హామీలు అద్భుతంగా ఉన్నాయని.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మరికొందరు మాత్రం బీఆర్ఎస్ హామీలను వేలెత్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆ ధరలు తగ్గించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అయినప్పటికీ ఇన్ని రోజులు తగ్గించకుండా.. తీరా ఎన్నికలొచ్చాక ఓటు వేస్తే తగ్గిస్తామనడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు పోయినసారి నిరుద్యోగులకు అండగా ఉంటామని.. ప్రతినెలా నిరుద్యోగ భృతి అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ హామీని ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. ఈసారి మేనిఫెస్టోలో అయితే అసలు నిరుద్యోగుల మాటే ఎత్తలేదు. దీంతో ఆ హామీ సంగతేంటి అంటూ కేసీఆర్‌ను నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా తమ హామీలను కాపీ కొట్టారంటూ విమర్శలు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =