మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman, Interim Budget, Budget 2024, Central Budget, Budget 2024 Live Updates, Finance Minister Nirmala Sitharaman, Finance Minister, Modi government, Budget, 10th Union Budget today, Lok Sabha elections, Indian Political News, National Political News, Mango News Telugu, Mango News
Nirmala sitaraman, Budget 2024, Central Budget

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. తాజాగా ఐదో సారి బడ్జెట్‌ను ప్రకటించారు. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డ్‌ను నిర్మలా సీతారమన్ బ్రేక్ చేశారు. ఈసారి కూడా పేపర్ లెస్ పద్ధతిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ పరిమాణం మొత్తం రూ.47.66 లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయన్న నిర్మలా సీతారామన్..  వచ్చే అయిదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని చెప్పుకొచ్చారు.

2024 నాటికి భారత్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీతారామన్ వివరించారు. పేదలు, రైతులు, మహిళలు, యువకులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని.. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. దీనివల్ల 80 కోట్ల మంది పేదలు లభ్దిపొందారని వివరించారు. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నామని పేర్కొన్నారు.

డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తోందని వివరించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామని.. సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే మౌలిక వసతుల రంగానికి రూ. 11.11 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం నెలవారీ జీఎస్టీ ఆదాయ రూ. 1.66 కోట్లకు చేరిందని.. జీఎస్టీ ముందున్న విధానం కన్నా ప్రస్తుత ఆదాయం రెట్టింపు అయిందని సీతారామన్ పేర్కొన్నారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైలు బోగీలన్నింటినీ వందేభారత్ ప్రమాణాలతో మారుస్తామని చెప్పారు.

ఇక ఈ బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ. 6.2 లక్షల కోట్లు.. ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ. 2.78 లక్షల కోట్లు, రైల్వే శాఖకు రూ. 2.55 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ. 1.77 లక్షల కోట్లు.. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ. 1.27 లక్షల కోట్లు.. రసాయనాలు, ఎరువుల కోసం రూ. 1.68 లక్షల కోట్లు.. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కోసం రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించినట్లు సీతారామన్ వివరించారు.

అంతేకాకుండా సోలార్ విద్యుత్ గ్రిడ్‌లకు రూ. 8,500 కోట్లు.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ. 600 కోట్లు.. సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ కోసం రూ. 6,903 కోట్లు.. ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7,500 కోట్లు.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 86 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక గతేడాది ప్రతిపాదించిన పన్ను విధానాన్నే ఈ సారి కూడా కొనసాగిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్నుభారం లేకుండా రిబేటు ఉంటుందని వివరించారు. అలాగే కార్పోరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =