వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరుకు ప్రభుత్వం సిద్ధం – సీఎం కేసీఆర్

Agriculture Department, CM KCR, kcr latest news, KCR Review Meeting, KCR Review Meeting on Agriculture Department, Pragathi Bhavan, telangana, Telangana Agriculture Department, Telangana CM KCR, Telangana News, Telangana Political Updates

వ్యవసాయ శాఖపై జూలై 22, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు నూటికి నూరు శాతం చెప్పిన పంటలే వేశారని, ఏ గుంటలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నారో ఖచ్చితమైన వివరాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

‘‘వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి స్వతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం జరిపి, రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నాం. ఒక్క రూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబంధు పథకం కింద ప్రతీ పంటకు తమ ఖాతాల్లోనే జమ చేస్తున్నది. ఏ కారణం చేత రైతు మరణించినా అతడి కుటుంబానికి 5 లక్షల రైతుబీమా అందిస్తున్నది. కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన ప్రతీ పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులు ఏర్పాటు చేసింది. క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతుంది. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయి. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.

‘‘తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలి. అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఎంతో వ్యయం చేస్తున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలి. సంప్రదాయక వ్యవసాయ పద్దతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలి. వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలి. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలి. యాంత్రీకరణ పెరగాలి. ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ పిక్ క్రాప్స్ వచ్చాయి. వాటిని అధ్యయనం చేయాలి. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలి. వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలి. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలి. రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసి రావాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. మార్కెట్ ను అధ్యయనం చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేయాలి. ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను పెట్టి, ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్ డైరెక్టర్ ను నియమించాలి. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఎఇవోలను నియమించుకోవాలి. వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలని” సీఎం చెప్పారు.

‘‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారు. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదు అంటే, ఎవ్వరూ మక్కలు వేయలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారు. కాబట్టి రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలి. అది చాలా ముఖ్యమని” సీఎం ఆదేశించారు.

‘‘విపత్తుల వల్ల ఏర్పడే ఆకలి సమస్య చాలా దారుణమైనది. యుద్ధం కన్నా ఆకలి ఎక్కువ విలయం సృష్టిస్తుంది. కాబట్టి దేశం ఎప్పుడూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కొరత లేకుండా స్వయం సమృద్ధి సాధించాలి. 135 కోట్ల మంది ప్రజలున్న దేశానికి మరే దేశం తిండి పెట్ట జాలదు. కాబట్టి మన ప్రజలకు మనమే తిండి పెట్టే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. దేశం స్వయం పోషకం కావాలి. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం చేయాలని” సీఎం కేసీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =