గ్యారెంటీల‌కు సొమ్ములున్నాయా?.. ఆదాయ వివ‌రాల లెక్క‌ల్లో తెలంగాణ స‌ర్కారు..

Congress Government, Implementation, Six Guarantees, Congress Government Focus on Implementation of Six Guarantees, Congress government, CM Revanth reddy, Telangana, Revanth Reddy, KTR, Lok Sabha, Telangana Latest News, Telangana Politics, Mango News Telugu, Mango News, TS News
Congress government, six guarantees, CM Revanth reddy, Telangana

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రెండు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చుర‌గొంది తెలంగాణ స‌ర్కారు. హామీ ఇచ్చిన‌ట్లుగానే మిగ‌లిన గ్యారెంటీల‌ను కూడా వంద రోజుల్లోనే అమ‌లు చేయాల‌ని కంక‌ర‌ణం క‌ట్టుకుంది. వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే మ‌రో రెండు గ్యారెంటీల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని తాజాగా ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లు అయితే ఇచ్చారు కానీ.. ఆర్థిక వ‌న‌రులు ఎలా అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. రెండో విడ‌త‌గా గృహ‌జ్యోతి, మ‌హిళ‌ల‌కు నెల‌కు 2,500 లేదా పెంచిన ఫించ‌న్లు అందించేందుకు స‌ర్కారు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయాల్సిందిగా ఇప్ప‌టికే ఆర్థిక శాఖ‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే ఎంత ఖ‌ర్చు అవుతుంది.. ఎలా స‌మీక‌రించాలి అనేది అధికారులు రూపొందించే ప‌నిలో ఉన్నారు. వాటిలో ఒక్క గృహ జ్యోతి ప‌థ‌కం అమ‌లుకే నెల‌కు రూ. 4 వేల కోట్ల భారం స‌ర్కారుపై ప‌డుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ఆరు గ్యారెంటీల్లో ఒక‌టైన గృహజ్యోతి ప‌థ‌కంలో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు అందించాలి. వందరోజుల్లో ఆరింటిని అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ప్రజలు ఉచిత కరెంటుపై ఆశగా ఉన్నారు.  రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు కోటిన్నర కరెంట్‌ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.2 కోట్ల గృహ (డొమెస్టిక్‌) కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లు దాదాపు కోటి ఉన్నాయి. ఉచిత బ‌స్సు ప‌థ‌కం కోసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆర్టీసీకి నెల‌కు రూ. 250 కోట్లు చెల్లిస్తోంది. గృహజ్యోతి పథకం అమల్లోకి వస్తే విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని విద్యుత్‌ సంస్థల ప్రాథమిక అంచనా.

ప్రభుత్వం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది వినియోగదారులకు లబ్ధి కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలు, పలు సంస్థల నుంచి తీసుకున్న అప్పులు మొత్తం రూ.85 వేల కోట్ల వరకు ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌పై నిపుణులతో కమిటీ వేసి ఆ తర్వాత విధివిధానాలు రూపొందించి గృహజ్యోతి పథకం అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్ర‌ధానంగా గ్రేటర్‌ జోన్‌ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా మొత్తం 59 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్‌, హెచ్‌టీ కనెక్షన్లు 7 లక్షల వరకు కాగా, మిగిలినవి డొమెస్టిక్‌ కనెక్షన్లు. మొత్తం గృహ విద్యుత్‌ వినియోగదారుల్లో 40 లక్షల కనెక్షన్‌దారులు ప్రతినెలా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగిస్తున్నట్లు అంచనా.

ఈ లెక్కన ‘గృహజ్యోతి’ని అమలుచేస్తే ప్రతినెలా గ్రేటర్‌ నుంచి రూ.200 కోట్ల అదనపు భారం పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే వాటర్‌బోర్డు నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌కు రూ.4 వేల కోట్లు విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో ‘గృహజ్యోతి’ని అమల్లోకి తెస్తే మరింత భారం పడనుందని విద్యుత్‌ శాఖ లెక్కలు వేస్తోంది.గ్రేటర్‌ పరిధిలో 40 లక్షల గృహ కనెక్షన్లలో 35 లక్షల కనెక్షన్‌దారులు ప్రతినెలా 100-150 యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తుంటారు. 100 యూనిట్ల లోపు 2-3 లక్షల కనెక్షన్లు, 200 యూనిట్లపైన మరో 2-3 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కలు ప్రతినెలా మారుతుంటాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు సాధారణం కంటే 30-40 శాతం విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా నమోదవుతుంది. గ్రేటర్‌ జోన్‌ నుంచి టీఎస్ పీడీసీఎల్‌కు గృహ విద్యుత్‌, వాణిజ్య, హెచ్‌టీ కేటగిరీలో ప్రతినెలా రూ.900-1200 కోట్ల విద్యుత్‌ బిల్లులు వసూలవుతాయి. డిస్కంకు వచ్చే ఆదాయంలో 65-70 శాతం కమర్షియల్‌, హెచ్‌టీ కనెక్షన్ల ద్వారా వస్తోంది.

ఆరు గ్యారెంటీల‌కు ప్రేర‌ణ అయిన కర్ణాటకలో అమ‌లు తీరును ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. అక్క‌డ గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి కనెక్షన్‌కు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. గతంలో నెలనెలా ఆ గృహ వినియోగదారుడు ఎంత విద్యుత్‌ వినియోగించారో గుర్తించి దానికి మరో 15-20 శాతం అధనంగా వాడే వెసులుబాటు కల్పించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ అమల్లోకి తెస్తే 100, 150 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వాళ్లు కూడా 200 యూనిట్ల వరకు వినియోగించే అవకాశాలు పెరుగుతాయని, దీంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు లోడ్‌ పడి సరఫరాలో అంతరాయం తలెత్తే అవకాశాలుంటాయని ఇంజనీర్లు చెబుతున్నారు. అక్క‌డ ఎదురైన లోటుపాట్ల‌ను గుర్తించి ప్ర‌జ‌ల‌కు స‌వ్యంగా గృహ జ్యోతి అందిచేందుకు తెలంగాణ స‌ర్కారు సిద్ధం అవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 5 =