కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారు : పవన్ కళ్యాణ్

3 Capitals Bill, Andhra Pradesh 3 Capitals, AP 3 Capitals Bill News, AP 3 Capitals Bill Withdrawal, AP Govt to Withdraw 3 Capitals Bill, AP Govt Withdraws 3 Capitals Bill, CM YS Jagan Statement on AP Capital, janasena chief, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Responds over CM YS Jagan Statement on AP Capital, Mango News, pawan kalyan, Pawan Kalyan Responds over CM YS Jagan Statement on AP Capital, Repealing Three Capitals Law, YS Jagan Statement on AP Capital

మూడు రాజధానుల ఏర్పాటు, సి.ఆర్.డి.ఏ.రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులలో చురుకుగా హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ఉపక్రమించిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావిస్తున్నారు. కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చిలకపలుకు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారు. మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వై.సి.పి పెద్దలు మునిగి తేలుతున్నారు. రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో నాడు జరిగిన చర్చలో నాటి ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్ తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ లక్ష కోట్లు అవసరమవుతాయని, అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఇంత విస్తీర్ణంలో లేదని ఇప్పుడు చెబుతున్న సీఎం కనీసం 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే మరచిపోయారు. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులుపెట్టారు. మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఉద్యమంలో ఉన్న ఎస్.సి.లపై ఎస్.సి.లతోనే ఫిర్యాదులు చేయించి అట్రాసిటీ కేసులు బనాయించి వికృత చర్యలకు పాల్పడ్డారు. అమరావతిపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే రాజధాని చాలని ఒకే మాటపై నిలవగా ఒక్క వై.సి.పి. మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోంది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోంది. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =